Friday 21 November 2014

వచ్చే ఏడాది జరగనున్న భారత గణతంత్ర దినోత్సవ (జనవరి 26) కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమెరికా అద్యక్షుడు బరాక్ ఒబామా రానున్నారు. భారత గణతంత్రదిన వేడుకలకు అమెరికా అధ్యక్షుడు రానుం డడం ఇదే ప్రథమం. గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి రావాలని ప్రధాని మోదీ ఒబామాను ఆహ్వానించగా, దానికి ఆయన అంగీకరించారు.

మోదీ ఆహ్వానం మేరకు గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు అధ్యక్షుడు వచ్చే ఏడాది జనవరిలో భారత్‌కు ముఖ్య అతిథిగా వెళ్లనున్నారని, అమెరికా అధ్యక్షుడు ఈ గౌరవాన్ని అందుకోనుండడం ఇదే తొలిసారి కానుందని వైట్‌హౌస్ ప్రకటన జారీ చేసింది.

ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే దిశగా ఈ పర్యటనలో ఒబామా భారత ప్రధాని మోదీతో సమావేశమై చర్చలు జరుపుతారని పేర్కొంది. ఈ సారి గణతంత్రదిన వేడుకలకు మిత్రుడు హాజరు కానున్నారని, ముఖ్య అతిథిగా రావాలని ఒబామాను ఆహ్వానించినట్లు మోదీ కూడా ట్వీటర్‌లో వెల్లడించారు.